తెలుగు సినిమా చరిత్రలో చెదిరిపోని జ్ఞాపకం ఏఎన్ఆర్
Written by Graphic Designer Hyderabad on January 22, 2019
ఒక చిన్న పల్లె నుండి పరిధులు దాటిన ప్రపంచానికి…
సామాన్య రైతు కుటుంబంనుంచి అసామాన్య కీర్తి సామ్రాజ్యానికి…
వీధి రంగస్థలం నుంచి విను వీధిన వెలుగులు జీమ్మే విశ్వ వేదిక పైకి…
ఆ ప్రయాణం ఒక సంఘటన… ఆ పరిణామం ఒక సంచలనం.. ఆ ప్రస్థానం ఒక మార్గ దర్శనం..తెలుగు సినిమా స్వర్ణ యుగానికి ధీటైన నాయకుడాయన..,
యువరాజు నుంచి తాగుబోతు వరకు, జమీందార్ నుంచి పేదవాడి వరకు, సైంటిస్ట్ నుంచి సెయింట్ వరకు, ప్రేమికుడి నుండి ఆరాధకుడి వరకు, ఎన్నో పాత్రలకు ప్రాణం పోసారాయన. మాయాలోకం, ముగ్గురు ,మరాఠీలు, చెంచు లక్ష్మి, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్దం, బాలరాజు, తెనాలి రామకృష్ణ, రోజులుమారాయి, మిస్సమ్మ, ప్రేమించి చూడు, చక్రపాణి, దేవదాసు… ఇలా జానపదాలు,పౌరాణికాలు, చారిత్రకాలు, సాంఘికాలు అన్ని రకాల సినిమాలతోనూ మెప్పించి, ఒప్పించి, నేడు ఎందరికో రోల్ మోడల్ అయిన లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు! నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన బతుకు పుస్తకంలోకి కాసేపు…
కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురానికి చెందిన అక్కినేని వెంకట రత్నం, పున్నమ్మలకు ఐదవ సంతానంగా 1923 సెప్టెంబర్ 20న జన్మించిన నాగేశ్వర రావుకు చిన్న తనం నుండి నాటకాలంటే ఇష్టం. తమ గ్రామంలో పండుగలప్పుడు ప్రదర్శించే నాటకాలను చూసి మక్కువ పెంచుకున్న ఆయనకు కూడా నటుడవ్వాలని కోరిక . ఆ ప్రయత్నంలో ఒక సారి ఏఎన్నార్ కుతూహలాన్ని గమనించిన ఒకాయన స్త్రీ వేషం వేయించారు.ఆతర్వాత అనేక నాటకాల్లో స్త్రీ వేషం వేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ తర్వాత ఆ అనుభవం ఆయన్ని సినీ నటుడు కావడానికి ఉపయోగ పడింది.
విజయవాడ రైల్వే స్టేషన్లో నిర్మాత ఘంటసాల బలరామయ్యగారి కంట పడిన అక్కినేని అనుకోకుండా ‘ధర్మపత్ని’ సినిమాతో నటుడయ్యారు..
https://www.youtube.com/watch?v=H9hzdgV2DBY
“శ్రీ సీతారామ జనం” ఏ ఎన్నార్ ను కథానాయకుడిగా పరిచయం చేసింది.
1941 లో 17 ఏళ్ళప్పుడు సినీరంగ ప్రవేశం చేసిన నాగేశ్వర రావు 73 సంవత్సరాల పాటు తన సుదీర్ఘ నటనా ప్రయాణాన్ని కోన సాగించారు.
తెలుగు తో పాటు తమిళం, హింది లలో కూడా నటించిన ఏఎన్నార్ మొత్తం 256 సినిమాల్లో నటించారు. అప్పట్లో సాంఘిక, ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఏఎన్నార్, దేవదాసు, లైలామజ్ను, అనార్కలి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలలో ఆ పాత్రలను ఆయన తప్ప మరొకరు చేయలేరనే స్థాయిలో నటించి భగ్న ప్రేమికుడి గా నటించడంలో తనదైన ముద్రను వేసుకున్నారు. దాసరి నారాయణ రావు దర్శకత్వం లో వచ్చిన ప్రేమాభిషేకం ఏయన్నార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ! హైదారాబాద్ సిటీలో అత్యధికంగా 533 రోజులు ప్రదర్శించబడి ఒక కొత్త చరిత్రను రాసిన ఆ సినిమా రికార్డును నేటికీ ఎవరూ అధిగమించ లేకపోయారు. తన అసమాన నటన తో పాటు డాన్సులతో పాటలకు సరికొత్త గ్లామర్ ను తీసుకొచ్చింది ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వర రావే.
సరిగ్గా కెరీర్ ను ఆరంభించిన 50 ఏళ్లనాడు 1991 లో ఏఎన్నార్ నటించిన సీతారామయ్యగారి మనవరాలు మంచి విజయం సాధించింది.
మహాకవి కాళిదాసు, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, క్షేత్రాయ్య లాంటి సాహిత్య, సంస్కృతులకు అద్దం పట్టే ఎన్నో క్యారక్టర్లను అనుపమానంగా నటించి అద్భుతం అనిపించారు.,
సంసారం, బ్రతుకు తెరువు, అర్ధాంగి, ఆరాధన, దొంగరాముడు, మాంగల్య బలం, ఇల్లరికం, వెలుగునీడలు, మూగమనసులు, శాంతినివాసం, దసరాబుల్లోడు, ధర్మదాత లాంటి ఎన్నో చిత్రాలు కమర్షియల్ సక్సెస్ తో ఆయన విక్టరీ గ్రాఫ్ ను పెంచిన చిత్రాల్లో కొన్ని…
తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబద్ కు తరలించడంలో ఎంతో కృషి చేసి అన్నపూర్ణ స్టూడియో నర్మాణం తో పలువురికి ఆదర్శంగా నిలిచారు నాగేశ్వర రావు.
నటుడిగా ఉన్నత స్థానానికెగసిన ఏయన్నార్ తన జీవిత భాగస్వామి పేరున స్థాపించిన ‘అన్నపూర్ణ’ మరియు ‘చక్రవర్తి చిత్ర’ బ్యానర్లపై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించి మంచి నిర్మాతగా కూడా పేరు సంపాదించారు.
నటుడిగా చూపిన ప్రతిభకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహేబ్ ఫాల్కే, రఘుపతివెంకయ్య, ఎన్టీఆర్ అవార్డ్, నంది, కాళిదాస, కలైమామణి లాంటి ఎన్నో అత్యుత్తమ పురస్కారాలనందుకున్న అక్కినేని మూడు డాక్టరేట్లు తో గౌరవం పొందారు.
ఎంత సాధించినా ఎన్నిశిఖరాలనందుకున్నా ‘ఆగదు ఎనిముషము నీకోసము’ అన్న ఆయన సినిమాలోని పాట పంక్తులను గుర్తుచేస్తూ అక్కినేని గురుతులను మనకు చిరకాలం మిగిల్చి తన పని తాను చేసుకు పోయింది కాలం.